Wednesday, July 24, 2013

శ్రీశైలం (నీలం సంజీవరెడ్డి సాగర్) ప్రాజెక్టు పునాదికి యాభై ఏళ్లు.

ఆధునిక దేవాలయంగా పిలిచే శ్రీశైలం (నీలం సంజీవరెడ్డి సాగర్) ప్రాజెక్టుకు పునాది వేసి నేటికి యాభై ఏళ్లు. 1963 జులై 24న అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా పునాది రాయి పడిన ఈ ప్రాజెక్టు 1984 నాటికి అన్ని రకాలా పూర్తయి రాష్ట్రానికి విద్యుత్తు కాంతులను వెదజల్లడంతో పాటు లక్షలాది ఎకరాలకు సాగు నీరందించి రైతులకు జీవనాధారంగా మారింది. విద్యుదుత్పత్తి లక్ష్యంగా నిర్మాణం ప్రారంభించినా తర్వాత బహుళార్థక సాధక ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషించింది. ప్రారంభంలో నిర్మాణానికి ఆటుపోట్లు ఎదురైనా ఇంజినీర్ల పట్టుదల, అంకితభావంతో 1982 నాటికే నీటిని నిల్వ చేయడం మొదలుపెట్టారు. 1984 నాటికి గేట్లు సహా అన్నిరకాల నిర్మాణాలను పూర్తి చేసుకొని వినియోగంలోకి వచ్చింది. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ అధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టడంతో అప్పటి ఇంజినీర్లు ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతకు పెద్దపీట వేయడం వల్ల 2009లో వచ్చిన కనీవినీ ఎరుగని వరదకు శ్రీశైలం ఎదురొడ్డి నిలిచింది. డ్యాం నుంచి నీటిని విడుదలచేసే సామర్థ్యానికి రెండింతలు వరద రావడంతో కట్టకు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో అన్న ఆందోళన వ్యక్తమైనా నాణ్యతతో చేపట్టిన నిర్మాణం ఇంజినీర్లు గర్వపడేలా చేసింది.

లో పునాది వేసినా వెంటనే పనులు ప్రారంభం కాలేదు. నది స్వభావాన్ని బట్టి నీటిని మళ్లించి పనులు ప్రారంభించడానికి అవసరమైన పరిశోధనే నాలుగేళ్లకు పైగా జరిగింది. డ్యాం నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలానికి సమీపంలో పాతాళగంగ ఉండటం, అక్కడ నుంచి వరద ప్రవాహం వేగంగా ఉండటంతో నీటిని ఎలా మళ్లించాలన్నదానిపైనే సుదీర్ఘ కసరత్తు జరిగింది. చివరకు ప్రముఖ ఇంజినీర్ కె.ఎల్.రావు మార్గదర్శకంలో కాంక్రీట్ కాఫర్‌డ్యాంలు నిర్మించి పనులు చేపట్టారు. మొదట సాగర్‌లో పని చేస్తున్న కూలీలను మళ్లించి పనులు చేపట్టినా శ్రీశైలం వద్ద నది స్వభావాన్ని బట్టి సాధ్యం కాలేదు. మొదట కొందరు గుత్తేదారులకు అప్పగించిన పనులను కూడా తొలగించి 1974 నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ చేపట్టింది. అప్పటికి అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతోపాటు, పగలు, రాత్రి తేడా లేకుండా చేసిన కఠోర శ్రమ ఫలితమే భారీ వరదకు తట్టుకొని నిలబడటానికి కారణమని అక్కడ పని చేసిన ఇంజినీరింగ్ నిపుణుల అభిప్రాయం. 1984లో నిర్మాణం పూర్తయినప్పటి నుంచి అటు విద్యుత్తు, ఇటు సాగు, తాగునీటికే కాకుండా వరద నీటిని నిల్వ చేసుకొని ఉపయోగించుకోవడంలో కూడా శ్రీశైలం జలాశయం కీలకంగా మారింది. ఈ ప్రాజెక్టు ద్వారా 1670 మెగావాట్ల విద్యుదుత్పత్తితోపాటు నాగార్జునసాగర్ ఆయకట్టు అవసరాలకు తగ్గట్లుగా నీటిని విడుదల చేయడం, పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం కుడిగట్టు కాలువ, కేసీ కెనాల్, తెలుగుగంగ ఆయకట్టు, చెన్నై తాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేస్తోంది. వీటితో పాటు మిగులు జలాల ఆధారంగా చేపట్టిన గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ, కల్వకుర్తి తదితర భారీ ప్రాజెక్టులన్నీ శ్రీశైలం మీదనే ఆధారపడి ఉన్నాయి. శ్రీశైలం నిర్మాణానికి మొదట రూ.39.97 కోట్లకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. తర్వాత కాంక్రీటు ఆనకట్టగా మార్చిన తర్వాత ఈ అంచనాలో మార్పులు చోటు చేసుకొని, నిర్మాణం పూర్తయ్యేసరికి రూ.523.91 కోట్లకు చేరింది.
పూడికతో కోల్పోయిన సామర్థ్యం
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అంచనా వేసిన దానికంటే ఎక్కువగా పూడిక వచ్చి చేరడంతో శ్రీశైలం నీటినిల్వ సామర్థ్యంలో మూడో వంతు కోల్పోయింది. ఏటా పెరుగుతున్న పూడికుతోడు, 2009లో వచ్చిన భారీ వరద కారణంగా శ్రీశైలం నిల్వ సామర్థ్యాన్ని బాగా కోల్పోయింది. ఈ ప్రాజెక్టులో నిల్వ ప్రారంభమైనప్పుడు సామర్థ్యం 308 టీఎంసీలు. 1997లో నీటి నిల్వ సామర్థ్యంపై అధ్యయనం జరగ్గా 263.63 టీఎంసీలుగా తేలింది. ఏడాదికి 0.5 శాతం కంటే ఎక్కువ పూడిక చేరితే ప్రమాదమే. అయితే ఈ ప్రాజెక్టులో 0.82 శాతం ఉన్నట్లు తేలింది. 2009లో కృష్ణానదికి అత్యధిక వరద వచ్చింది. శ్రీశైలానికి వెయ్యేళ్లలో ఒకసారి 20.20 లక్షల క్యూసెక్కుల వరద (గరిష్ఠ వరద ప్రవాహం) రావచ్చని 2006లో జరిగిన అధ్యయనంలో తేలగా, 2009 అక్టోబరులోనే 25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. గరిష్ఠ స్థాయి నీటి మట్టాన్ని దాటి నిల్వ చేశారు. ఈ వరదల సమయంలోనే ఎక్కువ పూడిక వచ్చి చేరినట్లు తాజా అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం శ్రీశైలం నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ఈ ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం ప్రారంభించి మూడు దశాబ్దాలు దాటగా, 93 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. అంటే ఏడాదికి మూడు టీఎంసీలకు పైగా సామర్థ్యాన్ని కోల్పోయినట్లు. ఒకవైపు నిల్వ సామర్థ్యం తగ్గిపోతుండగా, మరోవైపు దీనిపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతోంది.

నిర్వహణ లోపాలు వెలుగులోకి: కృష్ణానదిపై అతి ప్రధాన ప్రాజెక్టు అయిన శ్రీశైలం నిర్వహణ విషయంలో నిర్లక్ష్యానికి గురవుతుందనే విమర్శలున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రత్యేకించి జలయజ్ఞం ప్రారంభమైన తర్వాత ఈ ప్రాజెక్టులో పని చేయడానికి ఆసక్తి చూపే వారి సంఖ్య తగ్గిపోయింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎస్.ఇలు, ఇ.ఇలు ఎక్కువగా ఇన్‌ఛార్జిలే. 2009లో భారీ వరద వచ్చినపుడు గేట్లు మొరాయించాయి. ఓ గేటు లేపడానికి కూడా సాధ్య పడలేదు. ఈ ప్రాజెక్టుకు 12 రేడియల్ గేట్లు ఉన్నాయి. వీటి ద్వారా 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంది. గేట్ల నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన త్రివేణి స్ట్రక్చరల్ లిమిటెడ్‌కు అప్పగించారు. ఈ సంస్థ సకాలంలో పూర్తి చేయక పోవడంతో సగం గేట్లను మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్‌కు అప్పగించారు. ఈ సంస్థ అన్ని గేట్లను పూర్తి చేసింది. 2009లో భారీ వరద వచ్చి గేట్ల నిర్వహణ సమస్య అయినపుడు 1984లో తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్ తరపున గేట్లను అమర్చడాన్ని సమన్వయం చేసిన కన్నయనాయుడు సహాయాన్ని నీటి పారుదల శాఖ తీసుకొంది. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం దాటడంతో రోడ్ బ్రిడ్జికి వైబ్రేషన్ మొదలైందని, ఆ సమయంలో ప్రాణాలకు తెగించి గేటును తెరిచామని నాటి అనుభవాలను ఆయన వివరించారు. డ్యాం, గేట్ల నిర్వహణలో ఉన్న లోపాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం 2009 వరద సమయంలో స్పష్టంగా బయటపడ్డాయి. రివర్స్ స్లూయిస్ వద్ద అత్యవసర గేటు దెబ్బతిన్నా మరమ్మతు చేయలేదు. అప్పటి భారీ వరదకు దెబ్బతిన్న వాటిని కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయలేదు. గేట్ల నిర్వహణ, గ్యాలరీ, డ్యాం నిర్వహణకు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.
ఫలితం దక్కని నిర్వాసితులు
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నిర్వాసితులైన వారి సంఖ్య కూడా ఎక్కువే. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 117 గ్రామాలను ఖాళీ చేయించగా, ఇందులో మహబూబ్‌నగర్ జిల్లాలో 65, కర్నూలు జిల్లాలో 52 ఉన్నాయి. 21,037 కుటుంబాలకు చెందిన వారు నిర్వాసితులయ్యారు. 84,756 ఎకరాల భూమిని కోల్పోయారు. నిర్వాసితుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. మూడేళ్లుగా అధికారులు గట్టి ప్రయత్నం చేసి ఈ సమస్యను ఓ కొలిక్కి తెచ్చినా, ఇంకా ఉద్యోగాలు రాని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. నిర్వాసితులు ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
స్వర్ణోత్సవాలను పట్టించుకోని ప్రభుత్వం
శ్రీశైలం నిర్మాణానికి శంకుస్థాపన చేసి జులై 24కు యాభై సంవత్సరాలవుతున్నా స్వర్ణోత్సవాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు రావడంతో కాస్తా ఆలస్యంగా నీటి పారుదల శాఖ స్పందించింది. ఈ నెల 24న కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించినా, వరదల కారణంగా కాస్తా ఆలస్యంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వర్ణోత్సవాల నిర్వహణకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే ఘనంగా నిర్వహిస్తామని శ్రీశైలం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ కృష్ణారావు 'ఈనాడు'కు తెలిపారు.
గర్వంగా ఉంది
శ్రీశైలం నిర్మాణంలో పాలుపంచుకొన్నందుకు ఎంతో గర్వపడుతున్నా. 2009లో వూహించని విధంగా భారీ వరద వచ్చినా డ్యాంకు ఏమీ కాలేదు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా ఇంజినీర్లు, ఇతర సిబ్బంది పని చేయడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే జరిగింది. మొదట రాతి కట్టడం నిర్మించాలని నిర్ణయించారు. కానీ నిర్మాణ స్థలాన్ని, నది స్వభావాన్ని బట్టి కాంక్రీటు డ్యాంగా చేపట్టాలని ప్రతిపాదనలు సవరించారు. ప్రభుత్వం అంగీకరించింది. ఇంజినీర్లంతా విలువలకు కట్టుబడి నాణ్యతలో రాజీ పడకుండా పని చేయడం వల్ల దాని ప్రభావం 2009లో వచ్చిన వరదల్లో స్పష్టంగా కనిపించింది.
- శ్రీశైలం నిర్మాణంలో పాలుపంచుకొన్న ఇంజినీర్ తిరుపతిరెడ్డి

ఇంజినీర్ల అంకితభావానికి నిదర్శనం
శ్రీశైలం నిర్మాణం ఇంజినీర్ల అంకిత భావానికి నిదర్శనం. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పని చేసిన 17 సంవత్సరాలు మరిచిపోలేనివి. శ్రీశైలానికి భారీ వరద వచ్చినపుడు డ్యామ్‌కు ఏమవుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికాం. ఆ ప్రాజెక్టుతో మాకున్న బంధం అలాంటిది. ఇంజినీర్లే కాకుండా అక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేశారు. నిర్మాణ క్రమంలో సుమారు 120 మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.
-సుబ్బరంగయ్య
1963
-ఈనాడు దినపత్రిక (24-07-2013) సౌజన్యం తో..

No comments:

Post a Comment

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...